4న యాదాద్రి శ్రీవారి తిరుకల్యాణమహోత్సవం

85

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 26 (న్యూస్‌టైమ్): తెలంగాణకు తలమానికమై ఆధ్యాత్మిక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యి. మార్చి 7 వరకు నిర్వహించనున్న ఉత్సవాల కోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నందున బాలాలయంలోనే శ్రీవారి ఉత్సవ కైంకర్యాలు నిర్వహించారు. వేలమంది భక్తులు తిలకించేలా కొండకింద జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో కల్యాణోత్సవం నిర్వహించేందుకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టాలు మార్చి 3న జరిగే ఎదుర్కోలు మహోత్సవంతో ప్రారంభంకానున్నాయి. మార్చి 4న జరుగనున్న శ్రీవారి తిరుకల్యాణమహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సైతం ఈ ఉత్సావాలకు హాజరుకానున్నారు. 5న శ్రీవారి దివ్యవిమాన రథోత్సవం, 6న చక్రతీర్థస్నానం, పూర్ణాహుతి శ్రీపుష్పయాగం దీపోత్సవం జరుగుతాయి. 7న జరిగే అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగారడోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. ఉత్సవాల కోసం రూ.40 లక్షలు వెచ్చించి భారీగా ఏర్పాట్లుచేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం అలంకారసేవలు, రాత్రి శ్రీవారి వాహనసేవలు జరుగుతాయి. భక్తులకు వినోదం అందించేలా మార్చి 2 నుంచి 6 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం వేళల్లో అలంకారసేవలు, రాత్రి శ్రీవారి వాహనసేవలు జరుగుతాయి. ఈ నెల 28న మత్స్యావతారం అలంకారంతో అలంకార సేవలు ప్రారంభమవుతాయి. 7న అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగారడోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి.