ఎక్కడ వెతికినా చంద్ర‌బాబు అవినీతే!

77
  • అసెంబ్లీలో పురాణగాధలపై పిట్టకథలు

అమరావతి, డిసెంబర్ 13 (న్యూస్‌టైమ్): ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా అధికార పార్టీ సభ్యులు, మంత్రులు శుక్రవారం శాసనసభలో ఒంటికాలిపై లేచారు. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడంతా అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చంద్రబాబునుద్దేశించి చెప్పిన పిట్టకథతో సభలో నవ్వులుపూయించారు. ఏకంగా రాంబాబు అయితే పురాణగాధపై ఓ కథను అల్లి చంద్రబాబుపై ఎక్కుపెట్టారు.

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు సభలో డిమాండ్ చేశారు. చంద్రబాబు ఈ వయసులో బూతులు నేర్చుకుంటున్నారని ఎద్దేవాచేశారు. ఉచ్చరించరాని పదాలతో తిడుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హౌస్‌ను డిజార్డర్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధుల చేత తిట్లు తినే దుస్థితి ఉద్యోగులకు రాకూడదన్నారు. 70 ఏళ్ల వయస్సు కలిగిన చంద్రబాబు 15 సంవత్సరాల వయస్సున్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

అనకూడని పదాలు వాడారని, వాటిని ఉచ్చరిండం కూడా సమంజసం కాదన్నారు. 70 ఏళ్లు దాటిన తర్వాత చంద్రబాబు బూతులు నేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 40 సంవత్సరాల అనుభవం, మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తే అందరూ సంతోషపడతారని చెప్పారు. స్పీకర్ ఇచ్చిన అపార్చునిటీ వినియోగించుకోలేదన్నారు. ధైర్యం ఉన్నవారు వంశీ మాట్లాడుతుంటే బయటికి ఎందుకెళ్లారని ప్రశ్నించారు. విచారణ వ్యక్తం చేయకుండా ఏవేవో కథలు చెప్పడం సమంజసం కాదన్నారు. బూతులు మాట్లాడుతున్న, క్రమశిక్షణారాహిత్యం, సభ గౌరవం లేకుండా మాట్లాడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే సభ్యులందరూ డిజార్డర్‌లోకి వస్తారని చెప్పారు.