మాతృభాషను మృతభాషగా మార్చిన వైసీపీ

134

గుంటూరు, నవంబర్ 11 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ మాతృభాష తెలుగును చివరికి వైసీపీ ప్రభుత్వం మృతభాషగా మార్చే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. నగరంలోని తెదేపా రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

వచ్చే విద్యా సంవత్సరంలో కూడా యథావిధిగా మాతృభాషలో విద్యను బోధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నంబర్‌ 81ను ఉపసంహరించుకోవాలన్నారు. జాతీయ విద్యా విధానంలో కూడా 1 నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన నిర్వహించేలా ఉందని గుర్తు చేశారు. ఉన్నపళంగా తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం వల్ల సుమారు 32 వేల మంది ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం మాతృభాషలోనే విద్యను బోధిస్తున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లతో ఏర్పాటుచేశామని బడ్జెట్‌లో చూపిన ప్రభుత్వం ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలను అరికట్టలేకపోవడం దురదృష్టకరమన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర సరకుల భారంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉల్లిపాయలు వాటి ధరతో ప్రజలకు ఘాటెక్కిస్తున్నా ప్రభుత్వానికి చీమైనా కుట్టినట్లు లేకపోవడం విచారకరమన్నారు. నిత్యావసర ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తుంటే కూరగాయల ధరలూ పెరిగిపోవడంతో ప్రజలపై మోపలేని భారం పడుతోందన్నారు.

రైతుబజార్లలో దళారి వ్యవస్థ ఇబ్బందులు సృష్టిస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాలుగు లక్షల మంది వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలివ్వడానికి పది లక్షల మంది ఉద్యోగులపై వేటు వేసిందన్నారు. ‘‘మీ జీతాలు పది వేలకు పెంచుతా’’ అని పాదయాత్రలో మాటిచ్చిన ముఖ్యమంత్రి ఒకే ఒక్క సంతకంతో 27,700 మంది వెలుగు యానిమేటర్లను రోడ్డున పడేశారన్నారు. తెదేపా వెలుగు యానిమేటర్లకు అండగా ఉంటుందని తెలిపారు. తెలుగు భాషను కించపరచేలా 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడం సరికాదన్నారు.