యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం: ఏయూ వీసీ

2121

విశాఖపట్నం: యోగ విద్యకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం లభిస్తోందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు అన్నారు. ఏయూ యోగా విలేజ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన యోగా థెరఫి ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. విభాగాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు యోగా పరిష్కారాన్ని చూపుతోందని ప్రపంచం గ్రహించిందన్నారు.

భారతీయ యోగ విద్యకు నేడు ఎంతో ఆదరణ లభిస్తూ ఉపాధి మార్గంగా నిలుస్తోందన్నారు. దీనికి అనుగుణంగా నూతన కోర్సులను ప్రారంభించడం జరుగుతోందన్నారు.యోగా విభాగాన్ని ఆధునీకరించడానికి, అదనపు వసతుల కల్పనకు కృషిచేస్తామన్నారు. యోగా థెరఫి కోర్సుసిలబస్‌ను వీసీ నాగేశ్వరరావు విడుదల చేశారు. కేంద్రం సంచాలకులు ఆచార్య రమేష్‌ బాబు మాట్లాడుతూ యోగా థెరఫి శిక్షణ విధానం, ఉపాధి అవకాశాలను వివరించారు.

ఏడాది కాలం కోర్సు బోధన, ఆరు నెలలు ప్రత్యక్ష శిక్షణ అందిస్తామన్నారు. ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి ఉపశమనం కలిగించే విధంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ వర్క్స్‌ డీన్‌ ఆచార్య వజీర్‌ మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.