తెరాసతో కలిసి వైకాపా కుట్ర: కోడెల

2990
  • తెదేపా గెలుపు ఆపలేరని స్పష్టీకరణ

  • తెలంగాణ అతిగా స్పందిస్తోందని వ్యాఖ్య

  • డేటా వివాదంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్పందన

  • జగన్ అరాచరకాల పట్ల అప్రమత్తత అవసరం

  • ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదని పునరుద్ఘాటన

గుంటూరు, మార్చి 5 (న్యూస్‌టైమ్): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని టీఆర్ఎస్‌తో కలిసి కుట్రలకు పాల్పడుతోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. గతంలో ఓటుకు నోటు పేరిట, నేడు డేటా చౌర్యం పేరిట అర్ధంలేని వివాదాలకు తెరలేపుతోందని, దీనికి పోలీసులను వాడుకోవడం దారుణమన్నారు. మంగళవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపొందడం ఖాయమన్నారు.

డేటా వివాదంపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో తెరాస సర్కారు అతిగా స్పందిస్తోందని అభిప్రాయపడ్డారు. తెరాస, బీజేపీతో కలిసి వైకాపా కుట్రలకు పాల్పడుతోందని, తన తప్పులను తెదేపాపై వేయాలని చూస్తోందన్నారు. జగన్ అరాచరకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ రాజకీయాలపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని పునరుద్ఘాటించిన ఆయన జిల్లాలో పార్టీ విస్తరణ, విజయానికి శక్తివంచనలేకుండా కృషిచేస్తానన్నారు. తాను నరసరావుపేట పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తానన్న ప్రచారాన్ని కోడెల కొట్టిపారేశారు.

తొలి నుంచీ ఢిల్లీ రాజకీయాలకు తాను దూరంగానే ఉంటున్నట్టు స్పష్టంచేశారు. రాష్ట్రంలో జాబితా నుంచి ఓట్లు తొలగించడం అనైతిక చర్య అని, నరసరావుపేట నియోజకవర్గంలో 1500 ఓట్లు అనైతికంగా తొలగించారని అన్నారు. ఓట్లు తీస్తున్నారని వైకాపా వాళ్లు తిరిగి గగ్గోలు పెట్టడం పీకే మార్కు రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. 1983 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నా ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రతిపక్ష నేతలు కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. తూర్పు గోదావరి జిల్లా తుని ఘటన, అధికారులపై దాడులు చూస్తే సమాజం ఎటుపోతోందో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. సభాపతిగా తనపై అనేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు వైకాపా నేతలు ఆధారాలు చూపించాలని సవాల్‌ విసిరారు. వైకాపా అరాచకాలతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీ కోసం చివరి వరకు తాను పోరాటం సాగిస్తానని స్పష్టంచేశారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనావెళ్లి పోటీ చేస్తామన్నారు. వైకాపాకు తెరాస, భాజపాలు తొత్తులుగా మారాయని దుయ్యబట్టారు. గతంలో జగన్‌ను విమర్శించిన తెరాస, భాజపా ఇవాళ పల్లకి మోస్తున్నాయని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెదేపా గెలుపును మాత్రం ఆపలేరన్నారు. సంక్షేమం, అభివృద్ధే పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలూ సంతృప్తిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. వైకాపా అరాచక, అనైతిక పనులు వారికే నష్టాన్ని తెస్తాయన్నారు. డేటా వివాదం అంశం తెలంగాణ రాష్ట్రం, వైకాపాకు సంబంధించినది కాదని, అలాంటిది వైకాపా తెలంగాణకు ఫిర్యాదు చేయడమేంటని నిలదీశారు? తెలుగువారు భౌతికంగా విడిపోయినా కలిసే ఉన్నామని స్పష్టంచేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట, నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా తాము గెలిపిస్తామన్నారు. 2014లో తాము అధికారంలోకి రాకముందు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలకు తెలియంది కాదని, అప్పుల్లో, లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రగతిబాట పట్టించారని కోడెల పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోమారు తెదేపాకు అధికారం అప్పగించి మిగిలిన అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలు పొందాలని పిలుపునిచ్చారు.