స్పీకర్ కోడెలపై వైఎస్సార్‌సీపీ వర్గీయుల దాడి

277

గుంటూరు, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లాలో మినీ యుద్ధమే జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడి చేశారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలు స్పీకర్‌ కోడెల చొక్కా చింపేశారు. పోలింగ్‌ సరళి పరిశీలనకు వచ్చిన కోడెలపై వైకాపా కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. ఆ సమయంలో ఆయనకు అడ్డుగా నిలిచిన గన్‌మెన్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో వాళ్లకు తీవ్రగాయాలయ్యాయి.

ఈ దాడిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కొని చితకబాదారు. ఈటీవీ ప్రతినిధి విజయ్‌ వద్ద ఉన్న కెమెరా, సెల్‌ఫోన్లు లాక్కొని ధ్వంసం చేశారు. ఈ దాడిలో కోడెల సొమ్మసిల్లి పడిపోయారు. దాడి అనంతరం కోడెలను అక్కడి నుంచి తరలించారు. ఈ గ్రామంలో వైకాపా ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అంతా ఏకమై దౌర్జన్యానికి పాల్పడ్డారని తెదేపా నేతలు ఆరోపించారు. ఓటమి భయంతోనే వైసీపీ ఈ తరహా దాడులకు పాల్పడిందన్నారు. పోలీసుల బందోబస్తు తక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో మరింత మంది భద్రతా సిబ్బందిని ఈ ప్రాంతానికి తరలించారు.