ప్రశ్నకు ఔననే విపక్ష పార్టీల శ్రేణుల కంటే కూడా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కోరుకునే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. కేవలం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న పథకాలే తమను ఈ ఎన్నికల్లో గట్టెక్కిస్తాయన్న ధీమాతో చాలా మంది వైసీపీ అభ్యర్ధులు ఉన్నారన్నది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లోని 98 వార్డుల్లో పరిస్థితి చూస్తే అర్ధమవుతుంది. చివరికి సీఎం జగనే తమ గెలుపునకు ‘బ్రాండ్ అంబాసిడర్’ అనే స్థితిలో కొంత మంది అభ్యర్ధులు ఉన్నారంటే ఆశ్చర్యమేస్తోంది. అయితే, ఇందులో అనుమానం ఏమీ లేదు. కాకపోతే, అలాగని ప్రతిపక్షాలను కూడా తక్కువ అంచనా వేయకూడదన్న కనీస రాజనీతి మరచిపోవడం శోచనీయం.

జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అయితే, అందులో లబ్దిదారులుగా ఉన్నవారిలో చాలా మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారూ ఉన్నారు. పథకాలతో ఓటు రాజకీయాలు ముడిపెట్టడం ఏ పార్టీ భవిష్యత్తుకూ మంచిది కాదన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘ఆలు లేదు, చూలు లేదు, కానీ కొడుకు పేరు సోమలింగం’ అన్న చందంలా కొందరు అభ్యర్ధులైతే మితిమీరిన ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుగానే వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీచేసేంత వరకూ వెళ్తున్నారు. పోలింగ్‌కు ఇంకా 24 గంటల సమయం ఉందన్న విషయాన్ని, ప్రతిపక్షాలు పరిశీలిస్తున్నాయన్న జ్ఞానాన్నీ ఈ మేథావులు మరచిపోయి ఇలా వ్యవహరిస్తుండడం చివరికి పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయి.

పార్టీని స్థాపించిన తర్వాత అధికారంలోకి రావడానికి జగన్ ఎంత కష్టబడ్డారు? జనం ప్రేమాభిమానాల కోసం ఎన్నేళ్లు వేచిచూశారు? ఆ దిశగా ఎన్ని ప్రయత్నాలు చేశారు? వంటి అంశాలను పూర్తిగా పక్కనపెట్టి కేవలం జగన్ పథకాలే తమను విజయతీరాలకు తీసుకువెళ్తాయన్న విశ్వాసంతో ముందుకు వెళ్తుండడం ఓవర్ కాన్ఫిడెన్స్ కిందకే వస్తాయనడంలో సందేహం లేదు. మొదట చెప్పినట్లే పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు కొంత వరకు ఫలిస్తాయి.. అలాగే, వార్డు స్థాయిలో అభ్యర్ధి గుణగణాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేసేవాళ్లు ఉంటారన్నది గతంలో అనేక సందర్భాలలో రుజువైంది.

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన జీవీఎంసీ తొలి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి తనతో పాటు తన కోడలు ఎమిలీ జ్వాలను) తన అనుచరులైన మరో ఇద్దరిని గెలిపించుకున్న ప్రస్తుత గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వంటి నేతలకు ఇలాంటి విషయాలను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు గానీ, నగరంలోని కొన్ని వార్డుల సహా భీమునిపట్నం, అనకాపల్లి, గాజువాక ప్రాంతాలలోని కొంత మంది వార్డు అభ్యర్ధులకు మాత్రం గుర్తుచేయాల్సిన అవసరం ఉంది. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకునే పూర్తి స్థాయి మెజారిటీ వైసీపీ సాధిస్తుందనడంలో సందేహం లేదు.. కానీ, ప్రధాన ప్రత్యర్ధులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా తమ ప్రభావాన్ని చాటుకుంటాయని చెప్పాలి. అలాగే, కొన్ని వార్డుల్లో ఉదాహరణకు గాజువాక జోన్ పరిధిలోని 65, 66, 67, 73, 74, 75, 76 వార్డుల్లో వైసీపీ ఇప్పటికే గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

65వ వార్డులో భారతీయ జనతా పార్టీ బలపర్చిన జనసేన అభ్యర్ధిని రత్నం, టీడీపీ అభ్యర్ధి గాంధీ కంటే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నారు. అదే విధంగా, 66వ వార్డులోనూ వైసీపీకి షౌకత్ అలీకి రెబల్ బెడదపట్టుకుంది. షౌకత్ అలీ, ఆయన సోదరుడు అస్మత్ అలీ (కాంగ్రెస్)తో పాటు స్వతంత్ర అభ్యర్ధిని లంక లత ఇక్కడ గట్టిపోటీ ఇస్తుండడమే కాకుండా వైసీపీ అభ్యర్ధిని ఇమ్రాన్ మహ్మద్‌ను ఆందోళనకు గురిచేస్తున్నారు. 65వ వార్డు అభ్యర్ధి కేబుల్ మూర్తి మాత్రం తన విజయం నల్లేరుపై నడకేనన్నంత ధీమా వాతావరణంలోకి వెళ్లిపోయారు. కానీ, ఇమ్రాన్ మాత్రం అనుక్షణం తన అనుచర గణాన్ని అప్రమత్తం చేస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయినా, 66వ వార్డులో టీడీపీ అభ్యర్ధి రఫీ టెన్షన్ ‌ఆయన్ని పీడిస్తూనే ఉంది. ఇదే వార్డు నుంచి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి డాక్టర్ గొర్లె సత్యనారాయణ పోటీలో ఉన్నప్పటికీ ఆయన ప్రభావం అంతగా ఉండకపోవచ్చని పరిశీలకుల మాట. ఇక, 73వ వార్డులో భూపతిరాజు సుజాత కూడా ప్రత్యర్ధి టీడీపీ నుంచి ఊహించని పోటీని ఎదుర్కొంటున్నారు.

74వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధే ప్రధాన అజెండాగా ఈసారి ప్రచారం చేస్తూ వచ్చారు. అలాగని, ఆ వార్డులో ఆయనకు పోటీలేదని, ఆశించిన మెజారిటీ వస్తుందని కాదు గానీ, టీడీపీ, జనసేన రూపంలో ఇక్కడా సమర్ధులైన యువకులే బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్ధులుగా ఉన్న పల్లా శ్రీనివాస్, ప్రసాదుల శ్రీను భార్య, గంధం శ్రీనివాసరావు, లేళ్ల కోటేశ్వరరావు లాంటి వాళ్లను అంత సులువుగా ఓడించడం కష్టమే గానీ, పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. అనకాపల్లి పరిధిలోని అన్ని వార్డుల్లో వైసీపీ, టీడీపీ నువ్వానేనా అన్నట్లు ఉంది. భీమునిపట్నం పరిధి వార్డుల్లో పరిస్థితీ అందుకు భిన్నంగా ఏమీ లేదు. అయితే, ఆయా నియోజకవర్గాలలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి తమ విజయం నల్లేరుపై నడకేనన్న ధీమాతో ఆయా వార్డుల అభ్యర్ధులు ఉన్నారు.

గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవీఎంసీ ఎన్నికలు జరిగినప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను, కార్యక్రమాలను చేపట్టింది. రోడ్లు, మురుగునీటి కాల్వలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ చాలా ప్రాంతాలకు అందుబాటులో ఉండేది.. అయితే, అప్పటి ఫలితాలను విశ్లేషిస్తే తెలుగుదేశం నిజంగానే తన ఉనికిని కోల్పోయి ఉండాల్సింది. కానీ, మెరుగైన ఓట్ల శాతంతో పాటు మిన్నగానే వార్డులనూ గెలుచుకుంది. ఇప్పటిలా అప్పట్లో జనసేన లేదు. ఇప్పుడు జనసేన ప్రభావం రేపు జరగబోయే ఎన్నికల ఫలితాలపై ఉండదన్న నమ్మకం ఎవరికీ లేదు.

‘విశాఖ ఉక్కు’ ప్రభావం ఎంత?

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరిస్తుందన్న నేపథ్యంలో ఒక్కసారిగా రేగిన ఉద్యమం ప్రభావం జీవీఎంసీ ఎన్నికలపై ఏ మేరకు ఉంటుందన్నదే ప్రశ్న. కేవలం ఎన్నికలు సమీపిస్తున్నాయనే అధికార వైసీపీ ఉక్కు ఉద్యమాన్ని భుజాన వేసుకుందన్న విపక్షాల విమర్శలను ఉద్యోగులు తోసిపుచ్చి ఆ పార్టీని ఆదరిస్తారా? అన్నదానిపై కూడా పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వార్డు అభ్యర్ధులు ఆశలు పెట్టుకున్నారు. ‘గల్లీలో కాదు… ఢిల్లీలో మీ సత్తా నిరూపించండి’ అన్న జనసేన, తెలుగుదేశం పార్టీల సవాలుకు వైసీపీ నుంచి ప్రతి విమర్శలు తప్ప సమాధానమేదీ రాలేదు. ఒక అనధికారిక అంచనా ప్రకారం, ‘ఉక్కు’ ప్రయివేటీకరణ ప్రభావం కంటే కూడా గంగవరం పోర్టు అదానికి అప్పగించిన ప్రభావం అయితే 64, 65, 74 వార్డులపై తీవ్రంగానే పడనుంది.