ముందు మీ తాటతీయకుండా చూసుకోండి!

237
  • పవన్ కల్యాణ్‌పై ధ్వజమెత్తిన అంబటి రాంబాబు

గుంటూరు, నవంబర్ 4 (న్యూస్‌టైమ్): ‘‘నదులు పొంగి ప్రవహిస్తున్నాయని పదే పదే చెప్పాము. అందువల్లనే ఇసుక తీయలేకపోతున్నాం అని తెలియచేశాం. వరదలు తగ్గినంత వరకూ ఇసుకతీయడం సాధ్యం కాదనీ చెప్పాం. కానీ, మూర్ఘుల మనస్సులను రంజింపచేయలేము కదా?’’ అని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి, సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ విశాఖలో పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేశారని, అందులో భవన నిర్మాణ కార్మికులెవరూ కనిపించలేదన్నారు.

అందులో జనసేన జెండాలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు మాత్రమే దర్శనమిచ్చారని, దీన్ని బట్టి ఆ రెండు పార్టీల విధానం ఏమిటో అర్ధమవుతోందన్నారు. ‘‘ఆ రెండు కిలోమీటర్లు కూడా నడవలేక కారు ఎక్కారు. అది టీవీలలో చూశాం. పవన్ కల్యాణ్ మీ రాజకీయాలు మీరు నడుపుకుంటే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. డీఎన్ఏ అంటే మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎన్ఏ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యక్తిగతమైనది కాదు. మళ్లీ చెబుతున్నాను టీడీపీ, జనసేన డీఎన్ఏ ఒక్కటే’’ అని పునరుద్ఘాటించారు.

‘‘నిన్న మీరు తాటతీస్తామన్నారు. మీరు రెండు చోట్ల నిలబడితే ప్రజలు తాటతీశారు. మీమ్మల్ని మూలన కూర్చోబెట్టారన్నారే. కాదు మూలనకాదు కూర్చోబెట్టారు… వంగోబెట్టారు… తాటతీయడం అంటే ఆరునెలలకు ఒకసారి గడ్డం తీయడం కాదు. రాజకీయంగా తాటలు తీస్తే తాటలు తీయించుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టే కాదు ఎవరూ సిద్దంగా లేరు. మీ నోరు పెద్దది కావచ్చు. కానీ, మీ నోరు కన్నా వేయిరెట్లు పెద్దది మా నోరు గుర్తుపెట్టుకోండి’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తానంటే ప్రజలే మీ తాటతీస్తారు. తాటిచాపచేస్తారు. దయచేసి మీరు మరిచిపోవద్దు. రాజకీయాలలో విమర్శలు చేయండి, అవి కూడా సద్విమర్శలు చేయాలిగాని వ్యక్తిగతంగా ఉండకూడదు. మా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబునుద్దేశించి ఏం మాట్లాడుతున్నారు? మీరు కాకినాడ వెళ్లి కన్నబాబును ఓడించండి అని మీరు కోరితే తుక్కుతుక్కుగా మిమ్మల్నే ఓడించారు. కన్నబాబును గెలిపించారు. కన్నబాబు గతంలో మీ పార్టీలో ఉండి ఉండవచ్చు.. మీ అన్నగారి పార్టీలో టిక్కెట్టు ఇచ్చి ఉండవచ్చు. అందులో 18 మంది గెలిస్తే వారిలో కన్నబాబు ఒకరు. కన్నబాబుపై మీకు హక్కు లేదు. ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న కన్నబాబును ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తారా? కన్నబాబు కథ అంతా తెలుసంటారా? ఏం తెలుసు మీకు? విజయసాయిరెడ్డి గురించి మీరు మాట్లాడారు. రెండున్నరేళ్లు జైలులో ఉన్నారని, వారికి మిమ్మల్ని విమర్శించే హక్కు లేదని, జగన్ కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని ఇవన్నీ మీ మాటలు కాదు. కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు స్క్రిప్ట్ తీసుకువస్తే చదివే దౌర్భాగ్యపరిస్ధితి’’ అని రాంబాబు ఎద్దేవాచేశారు.

‘‘ఇంతకుముందు టీడీపీ వాళ్లు కూడా అన్నారు. వారందరికీ తెలియచేస్తున్నా. జగన్ కేవలం నేరారోపణ చేయబడ్డ వ్యక్తి. 16 నెలలు జైలులో ఉన్నవ్యక్తి. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్న వ్యక్తి. ఇవన్నీ తెలిసే ప్రజలు ఎన్నికలలో 151 సీట్లలో గెలిపించారు. రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి గురించి అవాకులు చెవాకులు పేలడం మంచిది కాదు. రాజకీయంగా వంద విమర్శలు చేయండి వాటికి సమాధానం చెబుతాం. చంద్రబాబు సత్తా అయిపోయింది. రాజకీయంగా దాడులు చేయడానికి చూస్తున్నారు. అయినా స్పందన రావడం లేదు. ఆ మధ్య లోకేష్‌తో దీక్ష చేయించారు. దానికి సైతం స్పందన లేదు. దాంతో మీరు లాంగ్ మార్చ్ పెట్టారు. చంద్రబాబు అజెండాను మోయడం కోసం మీరు రాజకీయం నడుపుతున్నారు. మీ అభిమానులు కూడా జగన్‌కి ఎందుకు ఓట్లు వేశారంటే మీకు ఓట్లు వేస్తే సైకిల్‌కు ఓటు వేసినట్లేనని భావించి మాకు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భుజంపై తుపాకి పెట్టి మమ్మల్ని కాల్చాలని ప్రయత్నం చేస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు.

‘‘పవన్ కల్యాణ్ మీకు మరోసారి సలహా ఇస్తున్నాము… రాజకీయాలలో మీ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లండి. మాకు సిధ్దాంతం ఉంది, మాకు నైజం ఉందంటున్నారు. ఏంటి మీ సిధ్దాంతం? కూలిపోయిన తెలుగుదేశం భవనాన్ని తిరిగి నిర్మించాలనే ప్రయత్నమే మీ సిధ్దాంతం. ఢిల్లీలో ఉండే నేతలతో మాకు సంబంధాలు ఉన్నాయి. పలుకుబడి ఉంది అంటారు. పలుకుబడి ఉంటే రాష్ర్ట అభివృధ్దికి కృషి చేయండి. ఓ పక్క బీజేపీతో సంబంధాలు నెరుపుతూనే వామపక్షాలతో మాట్లాడుతుంటారు. వారితో కలసి పోటీచేస్తారు. మాపై కుట్రతో కేసులు పెట్టారని భావించి ప్రజలు మమ్మల్ని గెలిపించారు. పవన్ కల్యాణ్ గారు మీ పార్టీని నడుపుకునే శక్తి లేకపోతే తిరిగి సినిమాలలోకి వెళ్లండి’’ అని హితవుపలికారు.

‘‘మళ్లీ మీరు సినిమాలలోకి వెళ్లి పనిచేసే పరిస్దితి వస్తుంది. జగన్ అద్బుతమైన పరిపాలన అందించడం ఖాయం. అందువల్ల మీకు సినిమాలలోకి వెళ్లే ఆలోచన వస్తున్నాయి. జనసేన టీడీపీకి బీ టీమ్. చంద్రబాబుకు దత్తపుత్రుడు మీరు. జనసేనను, టీడీపీని కట్టగట్టి సముద్రంలో పడేశారు. చంద్రబాబుకు 23 సీట్లు కాదు 24 సీట్లు అని తేలిపోయింది. భవన నిర్మాణ కార్మికుల కోసం, వారి సంక్షేమం కోసం పాటుపడతాం. ఆరునెలల్లోనే జగన్ ప్రభుత్వాన్ని ఏదో బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మీ వల్ల కాదు’’ అని అంబటి వ్యాఖ్యానించారు.